|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 12:38 PM
“జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భరోసా కల్పించారు. నంద్యాల జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిన వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నప్పటికీ, గెలిచిన కూటమి నాయకులే భయాందోళనలతో, అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాబోయే “జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని స్పష్టంగా ప్రకటించిన బుగ్గన, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికీ తమ “సూపర్ సిక్స్” హామీలను పూర్తి చేయకుండానే చేశామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. రైతుల పరిస్థితిపై ప్రత్యేకంగా స్పందించిన ఆయన, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పండించిన పంటలను వదిలేసి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తమ పాలన గొప్పదని ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.ఇటీవల జరిగిన కలెక్టర్‌ల సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలు పూర్తయ్యాయని మంత్రులు చెప్పినప్పుడు, కలెక్టర్లు ఆశ్చర్యంతో నోరు తెరచి చూసిన పరిస్థితి కనిపించిందని బుగ్గన ఎద్దేవా చేశారు. “తల్లికి వందనం”, ఉచిత సిలిండర్లు వంటి పథకాలు ఎంతవరకు అమలయ్యాయో ప్రజలకు తెలుసు… దేవుడికి కూడా తెలుసు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గొప్ప సంకల్పంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కానీ నేడు అదే రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Latest News