|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:06 PM
బంగ్లాదేశ్‌లో చెలరేగుతున్న హింసాత్మక నిరసనలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లర్ల వల్ల సాధారణ బంగ్లాదేశీలకు భారత్ చేసే సాయం తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన భౌగోళిక పరిస్థితులను మార్చుకోలేం అనే సూక్తిని ఆయన గుర్తుచేశారు.హింస కారణంగా బంగ్లాదేశ్‌లోని రెండు భారత వీసా కేంద్రాలను మూసివేయాల్సి వచ్చిందని థరూర్ తెలిపారు.భారత్‌కు రావాలనుకునే బంగ్లాదేశీలు వీసాలు సులభంగా రావడం లేదని ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు వారికి మన కేంద్ర ప్రభుత్వం సాయం చేయడాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి అని ఆయన అన్నారు.వాజ్‌పేయి గారు పాకిస్థాన్ గురించి చెప్పినట్టుగా, మనం మన భౌగోళిక పరిస్థితులను మార్చుకోలేం. మాతో కలిసి పనిచేయడం వారు నేర్చుకోవాలి అని థరూర్ హితవు పలికారు.ఇంక్విలాబ్ మంచ్ అనే సంస్థ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్‌లో తాజాగా అల్లర్లు చెలరేగాయి. గత శుక్రవారం ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆయన మరణించారు.భారత్‌కు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు హాదీ తీవ్ర విమర్శకుడిగా పేరుపొందారు. హసీనా అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన ఇంక్విలాబ్ మంచ్ సంస్థ, బంగ్లాదేశ్‌లో భారత్ ప్రభావానికి వ్యతిరేకంగా పలు నిరసనలు చేపట్టింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై థరూర్ స్పందిస్తూ ఈ మొత్తం పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, ఢాకాలోని భారత హైకమిషన్ అధికారులు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని తెలిపారు.
Latest News