|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 11:44 AM
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల ఓ అధికారిక కార్యక్రమంలో మహిళా ఆయుష్ డాక్టర్ హిజాబ్‌ను తొలగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. పట్నాలో నియామక పత్రాల ప్రదానోత్సవంలో జరిగిన ఈ సంఘటన వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేగింది. ప్రతిపక్ష పార్టీలు, ముస్లిం సంఘాలు, ప్రముఖులు నితీష్ చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆయన భద్రతను పెంచారు.
నిఘా సంస్థలు అందించిన సమాచారం మేరకు బిహార్ పోలీసులు నితీష్ కుమార్ భద్రతను మరింత కఠినతరం చేశారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ) బాధ్యతలు పెరిగాయి. ఆయన నివాసం, కార్యాలయం చుట్టూ ఎస్‌ఎస్‌బీ కార్డన్‌ను బలోపేతం చేశారు. అదనపు భద్రతా సిబ్బందిని నియమించడంతో పాటు, ఆయనకు సన్నిహితంగా వచ్చే వ్యక్తులను పరిమిత సంఖ్యలో ఉన్నతాధికారులకే అనుమతిస్తున్నారు.
ఈ వివాదం కారణంగా పాకిస్తాన్‌లో ఉన్న గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టీ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసి నితీష్‌కు బెదిరింపు విడియో పోస్టు చేశాడు. దీనిపై పట్నా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ పెంచారు. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు.
ఘటన జరిగిన కార్యక్రమంలో నుస్రత్ పర్వీన్ అనే మహిళా డాక్టర్ హిజాబ్ ధరించి వచ్చినప్పుడు నితీష్ "ఏమిటది?" అంటూ దాన్ని తొలగించారు. ఈ చర్యపై జావేద్ అక్తర్, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు క్షమాపణ కోరుతూ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే కొందరు మంత్రులు ఇది తండ్రిలాంటి ప్రేమ అని సమర్థించారు.
Latest News