|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:34 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని చేర్చుకున్నారు. ఒమన్ పర్యటనలో ఉన్న ఆయనకు ఆ దేశ అత్యున్నత పురస్కారమైన 'ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్'ను సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ గురువారం ప్రదానం చేశారు. గతంలో క్వీన్ ఎలిజబెత్, నెల్సన్ మండేలా వంటి ప్రపంచ ప్రఖ్యాత నేతలకు మాత్రమే ఈ పురస్కారం దక్కింది. రెండు రోజుల క్రితమే ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మోదీకి ఇది 29వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం.అంతకుముందు, ప్రధాని మోదీ, ఒమన్ సుల్తాన్ హైథమ్ మధ్య మస్కట్‌లోని అల్ బరకా ప్యాలెస్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదరడాన్ని ఇరువురు నేతలు ఒక కీలక మైలురాయిగా అభివర్ణించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.భారత్, ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 'మైత్రీ పర్వ్' కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే, ఇండియా-ఒమన్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొని, ఒమన్ వ్యాపారవేత్తలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Latest News