|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:40 PM
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధూ జలాలను భారత్ పరిమితం చేయడంతో దాయాది విలవిలలాడుతోంది. ఈ క్రమంలో అఫ్తనిస్థాన్ పులిమీద పుట్రలా మరో బాంబు పేల్చింది. ఇరు దేశాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కునార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్ట్‌కు తాలిబన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టైమ్స్ నివేదిక ప్రకారం.. అఫ్గన్ ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక కమిషన్ సాంకేతిక కమిటీ సమావేశంలో కునార్ నది నుంచి నంగర్‌హార్‌లోని దారుంతా డ్యామ్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీనిపై తుది నిర్ణయం కోసం ఆర్థిక కమిషన్‌కు పంపారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అఫ్గనిస్థాన్ నంగర్‌హార్ ప్రావిన్సుల్లో వ్యవసాయ భూములకు నీటి కొరత తీరుతుంది. అయితే, ఇది పాకిస్థాన్‌కు మాత్రం శరాఘాతమే అవుతుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. సుమారు 500 కిలోమీటర్లు ప్రవహించే కునార్ నది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ జిల్లాలో హిందూ కుష్ పర్వతాల నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి అఫ్గన్‌లోకి ప్రవహించి, కునార్, నంగర్‌హార్ ప్రావిన్సుల గుండా ప్రవహించి కాబూల్ నదిలో కలుస్తుంది. అనంతరం పెచ్ నది నీటితో కలిసి తూర్పుగా తిరిగి పాక్‌లోకి ప్రవేశించి, పంజాబ్ ప్రావిన్సుల్లోని అట్టాక్ నగరం సమీపంలో సింధు నదికి చేరుతుంది. కాగా, ఇప్పటికే అఫ్గన్ ప్రాజెక్ట్‌కు భారత్ మద్దతు ప్రకటించడం గమనార్హం.
పాక్‌లోని ప్రవహించే అతిపెద్ద నదులలో ఇది ఒకటి. సింధు నది మాదిరి ఇది కూడా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైన వనరు. ముఖ్యంగా సరిహద్దు హింసకు కేంద్రంగా ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి ఇది చాలా కీలకం. కునార్ నది పాక్‌లోకి తిరిగి ప్రవేశించే ముందు దానిపై ఆనకట్టలు నిర్మిస్తే, పాకిస్థాన్‌లో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులకు నీటి లభ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పటికే భారత్ సింధు జలాలను పరిమితం చేయడంతో ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు.
అయితే, భారత్‌తో సింధు జల ఒప్పందం ఉన్నట్టు ఇస్లామాబాద్‌కు కాబూల్‌తో నీటి పంపకాలపై ఎటువంటి ఒప్పందాలు లేవు. దీనివల్ల తాలిబన్లను ఆపడానికి తక్షణ మార్గం లేదు. ఇది పాకిస్థాన్-అఫ్గన్ మధ్య మరింత ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇరు దేశాలూ సరిహద్దుల్లో కారాలు మిరియాలు నూరుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఉద్రిక్తతలు క్రమంగా పెరిగి.. అక్టోబరు నుంచి తారాస్థాయికి చేరుకున్నాయి. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్సుల్లో తెహ్రిక్ తాలిబన్ పాకిస్థాన్ మిలీషియా గ్రూప్, పాక్ సైన్యం మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సొంత పౌరులపైనే పాక్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది.
Latest News