|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 07:47 PM
తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం ఎంతో మంది భక్తులు విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్టులకు విరాళాలు సమర్పిస్తూ సామాజిక సేవతో పాటుగా శ్రీవారి సేవలోనూ తరిస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ టీటీడీకి.. కోటీ 20 లక్షల విలువైన బ్లేడ్లు విరాళంగా అందించింది. హైదరాబాద్‌కు చెందిన వర్టిస్ అనే బ్లే్డ్ల తయారీ సంస్థ టీటీడీకి రూ.1.20 కోట్ల విలువైన బ్లేడ్లను విరాళంగా అందించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు.. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారనే సంగతి తెలిసిందే. తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కళ్యాణకట్ట వద్ద క్షురకులు ఉపయోగించే సిల్వర్ మ్యాక్స్ హాఫ్ బ్లేడ్లను వర్టిస్ సంస్థ విరాళంగా అందించింది. ఏడాది అవసరాలకు సరిపడే విధంగా బ్లేడ్లను విరాళంగా అందజేసింది.
వర్టిస్ సంస్థ ప్రతినిధులు టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం రోజున టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఈ విరాళం అందించారు. మరోవైపు భక్తులు తలనీలాలు సమర్పించేందుకు తిరుమల కళ్యాణకట్ట వద్ద రోజుకు 40 వేల హాఫ్ బ్లేడ్లను ఉపయోగిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ బ్లేడ్ల కోసం టీటీడీ ఏటా రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఏడాదికి సరిపడా బ్లేడ్లను టీటీడీకి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వర్టిస్ సంస్థను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.మరోవైపు ఈ హాఫ్ బ్లేడ్లు కల్యాణకట్ట వద్ద ఉండే క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వర్టిస్ సంస్థ తెలిపింది. అలాగే7′o క్లాక్ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రోజున భారీ విరాళం అందింది. పలువురు భక్తులు రూ.60 లక్షలు విరాళంగా అందించారు. బెంగుళూరు, గుంటూరుకు చెందిన భక్తులు వేర్వేరుగా రూ.10 లక్షలు చొప్పున విరాళంగా అందజేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ నాయుడును కలిసి విరాళం తాలూకూ డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. సోమవారం రోజున హైదరాబాద్‌కు చెందిన అనంత ఈశ్వర్ అనే భక్తుడు కూడా టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే.
Latest News