|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 07:25 PM
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త వినిపించారు. వచ్చే సంక్రాంతికి 21 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాసు పుస్తకాలు అందిస్తామని తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. భూముల రీ-క్లాసిఫికేషన్‌కు సంబంధించి.. దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయన్న మంత్రి.. అధికారులు వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. అలాగే ప్రైవేట్ భూములను ఎవరైనా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే.. ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామని మంత్రి ప్రకటించారు.
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టారు. రీసర్వే అనంతరం ఆయా రైతులకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న కొత్త పాసు పుస్తకాలు అందించారు. అయితే వైసీపీ హయాంలో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్ జగన్ బొమ్మ ఉండటాన్ని తప్పుబట్టిన టీడీపీ.. తాము అధికారంలోకి వస్తే జగన్ బొమ్మను తీసివేసి.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తా్మని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ రాజముద్రతో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకువచ్చింది. కొన్నిచోట్ల వీటిని తహశీల్దారు కార్యాలయాలకు చేరవేశారు కూడా.
అయితే పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు లేకుండా చూడాలని.. తప్పులు ఉంటే రైతులు మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో పాసు పుస్తకాల్లోని సమాచారం, వివరాలు కచ్చితంగా ఉండేలా చూడాలని.. అందుకోసం ప్రతి పాసుపుస్తకంలోని వివరాల్ని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తప్పులకు ఆస్కారం లేకుండా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయటం కోసం చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కారణంగా పాసుపుస్తకాల జారీలో ఆలస్యం జరుగుతోందని సమాచారం. ఈ క్రమంలోనే సంక్రాంతికి 21 లక్షల కొత్త పాసుపుస్తకాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. మరోవైపు రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో బ్యాంకు రుణాలు పొందేందుకు పాస్ పుస్తకాలతో సంబంధం లేదని ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
Latest News