|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:08 PM
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ జాబితా సమగ్ర సర్వే (సర్) పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బతికి ఉన్న వారి పేర్లనూ అధికారులు తొలగించారంటూ టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. అధికారుల తీరుకు నిరసనగా దాంకుని మున్సిపాలిటీ 18 వార్డు కౌన్సిలర్ సూర్య డే శ్మశానంలో ఆందోళన చేపట్టారు. సమగ్ర సర్వే తర్వాత ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాలో తన పేరు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మరణించానని పేర్కొంటూ ఓటర్ జాబితాలో నుంచి తన పేరును అధికారులు తొలగించారని ఆరోపించారు. ఓటర్ జాబితాలో తనను చంపేసిన ఎన్నికల సంఘం అధికారులు వెంటనే వచ్చి తన అంత్యక్రియలు చేయాలంటూ అనుచరులతో కలిసి శ్మశానంలో కూర్చున్నారు. ఓ ప్రజాప్రతినిధి అయిన తనకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని సూర్య ప్రశ్నిస్తున్నారు. సమగ్ర సర్వే సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులు తనకు అందజేసిన ఫారంను స్వయంగా తానే నింపి, అవసరమైన పత్రాలతో పాటు స్థానిక ఎన్యుమరేటర్ కు అందజేశానని సూర్య చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తన పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించడంపై ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ పొరపాటు కాదని, ఎన్నికల సంఘం చేస్తున్న విధ్వంసమని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News