|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 11:12 PM
ప్రపంచంలోనే బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్.. చైనాతో పాటు ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో చైనా తర్వాతి స్థానంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా భారత్‌లో దేశీయంగా బంగారం ఉత్పత్తి తక్కువగా ఉండటం.. ప్రజలు ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ధరిస్తున్న కారణంగా.. ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా బంగారం సరఫరాలో దిగుమతుల వాటానే సగానికిపైగా ఉంటుందని చెప్పొచ్చు. భారత్ ఎక్కువగా స్విట్జర్లాండ్ (40 శాతం), యూఏఈ, సౌతాఫ్రికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అయితే ఉన్నట్లుండి భారత్‌లో బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి.
>> 2025 నవంబర్ నెలలో పసిడి దిగుమతులు 4 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. ఈ విలువ భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 36 వేల కోట్లుగా ఉంటుంది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ (కామర్స్ మినిస్ట్రీ) నివేదించింది. గతేడాది ఇదే నవంబర్ సమయంతో పోలిస్తే రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు ఏకంగా 60 శాతానికిపైగా తగ్గాయి. 2024 నవంబర్‌లో పసిడి దిగుమతుల విలువ 9.8 బిలియన్ డాలర్లుగా అంటే రూ. 88 వేల కోట్లకుపైగా ఉండేది.
ఈ ఏడాది అక్టోబరులో కూడా పండగ గిరాకీ నేపథ్యంలో.. పసిడి దిగుమతులు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏకంగా 14.72 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో ఏకంగా రూ. 1.23 లక్షల కోట్లకుపైగా ఉండగా.. అక్కడితో చూసినా నవంబర్‌లో భారీగా దిగుమతులు పడిపోయాయని చెప్పొచ్చు. సాధారణంగా.. అంతర్జాతీయంగా లేదా దేశీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు భారీగా పెరిగితే.. ఇక్కడ కొనుగోలు శక్తి తగ్గి దిగుమతి డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడసలే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి. ఇదే సమయంలో చాలా మంది.. కొత్తగా బంగారం కొనలేక తమ దగ్గర ఉన్న పాత బంగారాన్ని విక్రయించి లేదా మార్పిడి చేసుకొని.. కొత్త బంగారం కొనుగోలుకు ఉపయోగిస్తుంటే కూడా దిగుమతుల అవసరం తగ్గుతుంది.
ఇక గతేడాది ఏప్రిల్- నవంబర్ ఇలా 8 నెలల వ్యవధిలో చూస్తే 43.8 బిలియన్ డాలర్లు (రూ. 3.94 లక్షల కోట్లు) విలువైన బంగారం దిగుమతి కాగా.. ఇది ఈ ఏడాది 8 నెలల్లో 3.3 శాతం వృద్ధితో 45.26 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది దాదాపు రూ. 4 లక్షల కోట్లుగా ఉంటుంది. బంగారం సహా ఇతర దిగుమతులు తగ్గడం.. ఇదే సమయంలో ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించి ఎగుమతులు పెరగడంతో.. వాణిజ్య లోటు (దిగుమతి, ఎగుమతుల అంతరం) నవంబర్‌లో 5 నెలల కనిష్ఠ స్థాయికి దిగొచ్చింది. ఇది 24.53 బిలియన్ డాలర్లుగా (రూ. 2.2 లక్షల కోట్లు) ఉంది. సాధారణంగా.. ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే.. వాణిజ్య లోటు పెరుగుతుందని చెప్పొచ్చు. అమెరికా.. భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధిస్తున్నా.. భారత్ ఎక్కువగా అమెరికాకే ఎగుమతులు చేస్తున్నట్లు సమాచారం.
Latest News