|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:46 PM
ప్రపంచంలోనే ప్రముఖ వార్తా సంస్థ బీబీసీకి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించని షాక్ తగిలింది. 2021లో క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన సందర్భంలో తాను చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చి ప్రసారం చేసిందంటూ ట్రంప్ బీబీసీపై భారీ పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదంపై ఆయన ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90,000 కోట్లు) నష్ట పరిహారం డిమాండ్ చేశారు.
ట్రంప్ తరఫు న్యాయవాదులు మియామిలోని ఫెడరల్ కోర్టులో 46 పేజీల దావాను దాఖలు చేశారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్‌పై తన మద్దతుదారులు దాడికి ముందు ట్రంప్ సుమారు గంట పాటు ప్రసంగించారు. అయితే బీబీసీ తన 'పనోరమ' డాక్యుమెంటరీలో ఈ ప్రసంగాన్ని రెండుచోట్ల ఉద్దేశపూర్వకంగా సవరించినట్లు ట్రంప్ ఆరోపించారు. తాను శాంతియుత నిరసనలకు మాత్రమే పిలుపును ఇచ్చానని.. కానీ బీబీసీ తన ప్రసంగాన్ని ఉద్వేగభరితంగా, రెచ్చగొట్టే విధంగా మార్చిందని ఆయన పేర్కొన్నారు.
"క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతో పాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదాం. ఘోరంగా పోరాడదాం" అన్నట్లుగా బీబీసీ ఎడిట్ చేసి ప్రసారం చేసింది. ఈ ఎడిటింగ్ ద్వారానే ప్రజలను తప్పుదోవ పట్టించారని ట్రంప్ ఆరోపించారు. ఈ చర్యల ద్వారా బీబీసీ తన పరువుకు నష్టం కలిగించడంతో పాటు ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘించి అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తోందని ట్రంప్ దావాలో పేర్కొన్నారు. ఈ రెండు ఆరోపణలకు గానూ ఒక్కొక్కదానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 10 బిలియన్ డాలర్లు నష్టపరిహారం కోరారు.
2021లో బీబీసీ చేసిన ఈ తప్పుడు ప్రసారం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ట్రంప్ తరపు నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో.. బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినా తగ్గని ట్రంప్ పరువు నష్టం దావా వేస్తానంటూ బెదిరించారు. దీంతో బీబీసీ చైర్మన్ సమీర్ షా స్వయంగా వైట్‌హౌస్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో తమ సంస్థతో పాటు తాను కూడా క్షమాపణలు చెబుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్రసంగం తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్నట్లు అంగీకరించారు. అంతేకాక ఈ వివాదాస్పద డాక్యుమెంటరీని భవిష్యత్తులో మళ్లీ తమ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేసే ప్రణాళిక లేదని బీబీసీ స్పష్టం చేసింది. అయినా వెనక్కి తగ్గని ట్రంప్ తాజాగా పరువు నష్టం దావా వేశారు.
Latest News