|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:30 PM
జోర్డాన్ పర్యటనను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియాకు చేరుకున్నారు. రాజధాని అడిస్ అబాబాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ స్వయంగా హాజరై ప్రధానిని కౌగిలించుకుని ఆపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రత్యేకమైన ఆతిథ్య సంజ్ఞగా ఇథియోపియా ప్రధాని, ప్రధానమంత్రి మోదీని స్వయంగా హోటల్‌కు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ముందుగా ప్రణాళికలో లేని సైన్స్ మ్యూజియం, ఫ్రెండ్‌షిప్ పార్క్‌లను ఆయన మోదీకి చూపించారు. అనంతరం ఇద్దరు నేతలు అనధికారికంగా స్నేహపూర్వకంగా సంభాషించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన అబీ అహ్మద్ అలీ ప్రదర్శించిన ఈ ప్రత్యేక హావభావాలు, భారత ప్రధాని పట్ల ఆయనకున్న గౌరవాన్ని స్పష్టంగా చూపించాయి. ఇథియోపియాలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం, అలాగే రెండు దేశాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.భారతదేశం ప్రస్తుతం ఇథియోపియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఇథియోపియా మధ్య మొత్తం రూ.5,175 కోట్ల వాణిజ్యం జరిగింది. ఈ కాలంలో భారతదేశం రూ.4,433 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయగా, ఇథియోపియా నుంచి భారత్‌కు రూ.742 కోట్ల విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి.భారతదేశం నుంచి ఇథియోపియా ఇనుము, ఉక్కు, ఔషధాలు, యంత్రాలు, పరికరాలను దిగుమతి చేసుకుంటుండగా, ఇథియోపియా నుంచి భారత్ పప్పుధాన్యాలు, విలువైన రాళ్లు, కూరగాయలు, విత్తనాలు, తోలు, సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటోంది. భారత్–ఇథియోపియా మధ్య సంబంధాలు 1940లలో, స్వాతంత్ర్యానికి ముందే ప్రారంభమయ్యాయి. దౌత్య సంబంధాలు ఏర్పడిన అనంతరం 1950లో రెండు దేశాల మధ్య అధికారిక వాణిజ్యం మొదలైంది.
Latest News