|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:01 PM
ప్రఖ్యాత బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి, తాను చెప్పని మాటలను తనకు ఆపాదిస్తూ బీబీసీ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని, దీనిపై దావా వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో, హాంకాంగ్‌లో జైలు పాలైన మీడియా వ్యాపారి జిమ్మీ లైను విడుదల చేయాలని తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు.వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. బీబీసీ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, ఇది జర్నలిజం విలువలకు తీవ్ర విఘాతమని అన్నారు. "నేను ఎప్పుడూ అనని భయంకరమైన మాటలను నా నోట పలికినట్లు చూపించారు. బహుశా వారు ఏఐ లేదా అలాంటి టెక్నాలజీ వాడి ఉంటారు" అని ట్రంప్ ఆరోపించారు. జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి దేశభక్తి గురించి తాను మాట్లాడిన మంచి మాటలను వదిలేసి, తాను అనని వ్యాఖ్యలను ప్రసారం చేశారని మండిపడ్డారు.ఈ వ్యవహారంపై మంగళవారం మధ్యాహ్నం లేదా బుధవారం ఉదయమే దావా వేయనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. దీన్ని ‘ఫేక్ న్యూస్’గా అభివర్ణించారు. వార్తల తయారీలో ఏఐ వినియోగంపై అమెరికా, ఐరోపా దేశాల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Latest News