|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 02:53 PM
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు కేంద్రమైన పరకామణిలో చోటుచేసుకునే దొంగతనాలను సాధారణమైనవిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయమని అభిప్రాయపడింది.పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను వెంటనే ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి, దాని స్థానంలో యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నూతన సాంకేతికతను వినియోగించాలని టీటీడీకి సూచించింది. చోరీలు జరుగుతున్నప్పటికీ ఇంకా పాత పద్ధతులనే అనుసరించడం సరికాదని వ్యాఖ్యానించింది.అదే సమయంలో, కానుకల లెక్కింపులో సేవాభావంతో పాల్గొనే భక్తులను దొంగల్లా చూస్తూ, దుస్తులు లేకుండా తనిఖీలు చేయడం వంటివి సరికాదని హితవు పలికింది. వారిని అవమానించడం తగదని పేర్కొంది. ఈ పవిత్రమైన ప్రక్రియలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది.
Latest News