|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:39 PM
రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాపై సీఎం చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపుతూ, విశాఖలో రూ.1500 కోట్ల విలువైన భూమిని రూ.45 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. పైగా ఆ రూ.45 కోట్లు కూడా గత నవంబరు 1 నాటికి డిపాజిట్ చేయకపోయినా.. రెండు నెలల గడువు ఇచ్చారని, ఆ వ్యవధికి కనీసం వడ్డీ కూడా వసూలు చేయబోవడం లేదని ఆయన గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సత్వాకి అప్పనంగా భూములు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని ఆరోపించారు.ఇంకా ఆ సంస్థకు వరుసగా ఇస్తున్న రాయితీలు చూస్తుంటే ప్రభుత్వ పెద్దల్లో తండ్రీ కొడుకులకు భారీగా కిక్‌బ్యాక్‌లు ముడుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. అదే సంస్థ గతంలో పొరుగున తెలంగాణలో రూ.600 కోట్లతో 20 ఎకరాల భూమి కొన్నదని, కానీ ఏపీలో మాత్రం ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.5 కోట్లకే కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. అలాగే ఆ సంస్థ నిర్మాణంలో సగం రెసిడెన్షియల్ కోసం వాడుకోవచ్చన్న ఆఫర్, అవినీతికి దారులు వేయడమే అని విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
Latest News