|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 01:01 PM
నెల్లూరు నగర మేయర్ పి. స్రవంతి రాజీనామాతో ఏర్పడిన పరిపాలనాపరమైన శూన్యతను భర్తీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మేయర్ ఎన్నికయ్యే వరకు డిప్యూటీ మేయర్ పొలిబోయిన రూప్ కుమార్ యాదవ్‌కు తాత్కాలికంగా మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వివరాల్లోకి వెళ్తే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను మేయర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంటూ స్రవంతి నిన్న తన రాజీనామాను సమర్పించారు. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌కు నివేదించారు. రాజీనామా అనంతరం చేపట్టాల్సిన చర్యల కోసం అత్యవసర సమావేశం తేదీని నిర్ణయించాలని కార్పొరేషన్ కమిషనర్ కోరగా, అందుకు స్రవంతి నిరాకరించినట్లు అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు.ఈ నేపథ్యంలో, కార్పొరేషన్ పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, సెక్షన్ 91(2) ప్రకారం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ను యాక్టింగ్ మేయర్‌గా నియమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Latest News