|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 08:39 PM
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ బాండీ బీచ్‌లో జరిగిన యూదుల మతపరమైన వేడుకల్లో ఉగ్రదాడి తీవ్ర దిగ్భాంత్రికి గురిచేస్తోంది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా.. అనేక మంది గాయపడ్డారు. అయితే, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ సాయుధుల దాడి నుంచి బయటపడిన వ్యక్తి తాజా దాడిలో గాయపడ్డాడు. తాను ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనను చూస్తానని ఎప్పుడూ ఊహించలేదని అతడు పేర్కొన్నాడు. బాధితుడు ఇటీవలే ఆస్ట్రేలియాకు రావడం గమనార్హం. ఈ కాల్పులను తీవ్రవాద చర్యగా పోలీసులు అభివర్ణించారు.
అతడు మీడియాతో మాట్లాడుతూ.. బాండి బీచ్‌లో జరిగిన ఈ దుశ్చర్యను రక్తపాతం, మారణహోమంతో పోల్చాడు. తన కుటుంబంతో కలిసి హనుక్కా వేడుకలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా వందలాది మంది ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకి కాల్పుల శబ్దంతో గందరగోళం నెలకొందని, చాలా మంది కింద పడిపోయారని వివరించాడు.
గత 13 ఏళ్లుగా ఇజ్రాయెల్‌లో ఉన్న తాను అక్టోబర్ 7 దాడుల నుంచి త్రుటిలో బయటపడినట్టు తెలిపాడు. యూదు సమాజంతో కలిసి పనిచేయడానికి, ద్వేషాన్ని ఎదుర్కోవడానికి రెండు వారాల కిందటే ఆస్ట్రేలియాకు వచ్చానని అన్నాడు. ‘‘మేము దీనిని కూడా అధిగమిస్తాం. ఈ పని చేసిన వారిని వదిలిపెట్టం’ అని అతను ధైర్యంగా చెప్పాడు. కాల్పుల సమయంలో భార్య, పిల్లల గురించే తాను ఆందోళన చెందానని, భగవంతుడి దయవల్ల వారు సురక్షితంగా బయటపడ్డారని అతను చెప్పాడు.
విచక్షణారహితంగా ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో పిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని, అది నిజంగా రక్తపాతమని అతను పేర్కొన్నాడు. ‘‘అక్టోబర్ 7న నేను ఇలాంటిది చూశాను. ఆస్ట్రేలియాలో ముఖ్యంగా బాండి బీచ్‌లో ఇలాంటిది చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు’ అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. మనుక్కా పండుగను పురస్కరించుకుని జరిగిన ఈ మతపరమైన కార్యక్రమంలో ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు. ఇద్దరు షూటర్లలో ఒకరిని పోలీసులు మట్టుబెట్టి, ఇంకొకడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముష్కరుడిపై పౌరుడు తిరగబడి అనేక మంది ప్రాణాలు కాపాడి నిజమైన హీరో అనిపించుకున్నాడు.
Latest News