|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 07:29 PM
అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్కపల్లి క్లస్టర్ రహదారిని విస్తరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి నక్కపల్లి క్లస్టర్‌కు నిర్మిస్తున్నరెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. NH- 16 నుంచి నక్కపల్లి క్లస్టర్‌కు 36 కోట్ల రూపాయలతో రెండు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. అయితే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు వరుసలను 4 వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.67.20 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మరోవైపు అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు నేపథ్యంలో నక్కపల్లి మండలం కాగిత నుంచి నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్‌ను మరింత విస్తరించనున్నారు. ఈ ప్రాంతంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. భూసేకరణ ప్రాంతాల్లోని గ్రామాల్లో రహదారులు, పరిపాలన భవనాలు, కాలువలు నిర్మించనున్నారు. అలాగే ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యే ప్రదేశానికి చేరుకునేందుకు నేషనల్ హైవే నుంచి 4.4 కిలోమీటర్ల మేరకు రహదారి నిర్మిస్తున్నారు.
2025 మార్చి నెలలో ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి నిర్మాణం కోసం 26 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు ఈ రహదారి మీదుగానే బల్క్ డ్రగ్ పార్కు, స్టీల్ ప్లాంట్‌కు వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు.
మరోవైపు విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్‌లో రహదారి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధురవాడ ఐటీ హిల్-3లో బీటీ రోడ్డుతో పాటుగా .. రిటైనింగ్ గోడ నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ రహదారి నిర్మాణం కోసం.. ఏపీఐఐసీ టెండర్లు కూడా పిలిచింది. ఇందులో అందరి కంటే తక్కువగా కోట్‌చేసిన కాంట్రాక్టర్ సంస్థకు పనులు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐటీ హిల్స్‌లో వివిధ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.