|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 07:15 PM
ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టా్త్మక సంస్థ కొలువుదీరనుంది. అనకాపల్లి జిల్లాలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్.. నూతన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అయితే ఈ సెంటర్‌ను విస్తరించాలని.. కొత్త ఆర్అండ్‌డీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని బార్క్ యోచిస్తోంది. కొత్త ప్రాజెక్ట్ కోసం 148.15 హెక్టార్ల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయాన్ని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బార్క్ నూతన ఆర్ అండ్ డీ క్యాంపస్ ప్రతిపాదనపై డిసెంబర్ నెల మొదటి వారంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ సమీక్షించింది. అనంతరం కొత్త ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
వ్యూహాత్మక కారణాలతోనే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం సమీపంలోని తూర్పు తీరంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సైట్ సెలక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు బార్క్ ప్రాజెక్ట్ కోసం అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే 3 వేల ఎకరాల రెవెన్యూ భూమిని సేకరించారు. అయితే తాజాగా కోరిన148.15 హెక్టార్ల అటవీ భూమి.. సేకరించిన ప్రాంతం పక్కనే ఉంది. అలాగే ప్రాజెక్ట్ స్థలం తీరప్రాంతం మధ్య ఉందని నిపుణుల కమిటీ వెల్లడించింది.
మరోవైపు బార్క్ నూతన రీసెర్చ్ అండ్ క్యాంపస్ నిర్మాణంలో భాగంగా.. కాంపౌండ్ వాల్, పంప్ హౌస్, వాచ్ టవర్లు, జోనల్ సెక్యూరిటీ ఫెన్సింగ్, పెట్రోలింగ్ రోడ్లు,డ్రెయిన్లు, సర్వీస్ లైన్లు వంటివి నిర్మించనున్నారు. ఈ కేంద్రం ద్వారా.. అణురంగంలో పరిశోధనలు చేయనున్నారు. ఇంధన భద్రత, ఆరోగ్యం, వ్యవసాయం, నీరు, ఇతర వ్యూహాత్మక రంగాలకు సంబంధించిన అప్లికేషన్ల కోసం పరిశోధనలు చేపట్టనున్నారు.
మరోవైపు బార్క్ ప్రాజెక్టుకు సంబంధం లేని ఏ కార్యకలాపాల కోసం కూడా.. కేటాయించిన అటవీ ప్రాంతంలో ఎటువంటి మార్పులు అనుమతించమని నిపుణుల కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో బార్క్ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేదీ చూడాల్సి ఉంది.
Latest News