|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:28 PM
కృష్ణా జిల్లా గుడివాడలో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని నెహ్రూ చౌక్ సెంటర్‌లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, తెల్లవారుజామున జరగడంతో ప్రాణ నష్టం తప్పింది.వివరాల్లోకి వెళ్తే.. నెహ్రూ చౌక్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఒక సెల్‌ఫోన్ దుకాణంలో మొదట మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ, అగ్నికీలలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణాల యజమానులు కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, తమ దుకాణాలు కాలిపోవడాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News