|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 12:10 PM
తెలంగాణ ప్రభుత్వం పోలవరం-నల్లమల సాగర్ సాగునీటి లింక్ ప్రాజెక్టుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న సమాచారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా తమ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, కృష్ణా నది జలాలపై హక్కులు దెబ్బతింటాయని తెలంగాణ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర జల్‌షక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం కనిపిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఊహించని ఆదేశాలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా కేవియట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ కేవియట్ పిటిషన్ దాఖలు బాధ్యతను రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కృష్ణా డెల్టా సిస్టం చీఫ్ ఇంజినీర్‌కు అప్పగించారు. త్వరలోనే ఢిల్లీలో కేవియట్ దాఖలు కానుందని, దీని ద్వారా తెలంగాణ ఏకపక్షంగా కోర్టుకు వెళ్తే తమ వాదనను కూడా వినిపించే అవకాశం లభిస్తుందని ఏపీ అధికార వర్గాలు భావిస్తున్నాయ.
ఇది రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత తీవ్రతరం కావడానికి దారి తీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ. ఇదిలా ఉంటే పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీకి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. మొత్తం రెండు ప్రముఖ సంస్థలు బిడ్లు సమర్పించగా, ఈ రెండింటిలో L1 (అత్యల్ప ధర బిడ్డర్)గా వచ్చిన సంస్థకు త్వరలో బాధ్యతలు అప్పగిస్తారని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయ.
డీపీఆర్ పూర్తికాగానే ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం కానున్నట్టు సమాచారం. ఈ లింక్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా ప్రాంతంతో పాటు రాయలసీమలోని ఎడారి జిల్లాలకు స్థిరమైన సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే తెలంగాణ నుంచి వస్తున్న నీటి ఆందోళనలు, ఇప్పుడు కోర్టు కేసు బెదిరింపు ఈ మెగా ప్రాజెక్టు ప్రయాణాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.