|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:41 PM
మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15న ఈ టోర్నీకి తెరలేవనుంది. భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో ఈ మినీ విశ్వకప్ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్ టికెట్లు సైతం.. అందుబాటులోకి వచ్చాయి. భారత్, సౌతాఫ్రికా రెండో టీ20 సమయంలోనే.. ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లు వేలంలోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా.. ఈ టోర్నీకి సంబంధించి ప్రచారాన్ని సైతం ఐసీసీ ముమ్మరం చేసింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఓ విషయంలో అలిగింది. ఐసీసీ చేసిన పని.. ఆ బోర్డుకు కోపం తెప్పించింది.
అసలేం జరిగిందంటే..
టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించిన మ్యాచ్ టికెట్లు.. డిసెంబర్ 11 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇదే సమయంలో టోర్నీకి సంబంధించి.. ఐసీసీ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈసారి టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. కానీ ఐసీసీ మాత్రం ఐదు ప్రధాన జట్లలోని ఆటగాళ్లతో పోస్టర్ విడుదల చేసింది.
ఐసీసీ విడుదల చేసిన పోస్టర్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్), దసున్ శనక (శ్రీలంక), ఎయిడెన్ మార్‌క్రమ్ (దక్షిణాఫ్రికా) ఫొటోలు మాత్రమే ఉన్నాయి. దీనిపై పాకిస్థాన్ అలిగింది. తమది కూడా పెద్ద జట్టేనని, తమ కెప్టెన్ సల్మాన్ అఘా ఫొటో లేకపోవడం అవమానకరమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటోంది. ఇటీవల ఆసియా కప్ 2025 పోస్టర్‌లోనూ తమ కెప్టెన్ ఫొటో లేదని.. ఇప్పుడు ఐసీసీ కూడా అలాగే చేసిందని పేర్కొంది.
“ఇటీవల ముగిసిన ఆసియాకప్ 2025 సమయంలోనూ మాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు అధికారిక ప్రసార సాధనాల్లో పాకిస్థాన్ కెప్టెన్ ఫొటో లేదు. దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను ప్రశ్నించిన తర్వాత.. టోర్నీ ప్రచార వీడియోలో మా కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫొటో పెట్టారు. కానీ టీ20 ప్రపంచకప్‌లోనూ ఇలానే జరిగింది. మా కెప్టెన్ ఫొటో ప్రమోషన్ పోస్టర్‌లో పెట్టాలి” అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీ ముందు వాపోయింది! 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది.
Latest News