|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 07:32 PM
విశాఖపట్నం ఇప్పుడు దేశంలోని ఇతర నగరాలతో కాకుండా ప్రపంచంతో పోటీ పడుతోందని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు విశాఖను ఒక పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో తన శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయడం చారిత్రక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. శుక్రవారం నాడు విశాఖ మధురవాడలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్న తీరును, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ సుమారు రూ.1500 కోట్ల పెట్టుబడితో విశాఖలో తన కార్యకలాపాలు ప్రారంభించడం ఒక కొత్త టెక్ యుగానికి నాంది అని లోకేశ్ అన్నారు. ఈ పెట్టుబడి ద్వారా తొలుత 8 వేల మందికి, భవిష్యత్తులో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే వెయ్యి మందితో తాత్కాలిక క్యాంపస్‌ను కూడా ప్రారంభించామని, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదని, కాగ్నిజెంట్‌కు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మధ్య బలమైన భాగస్వామ్యానికి ఆరంభమని పేర్కొన్నారు. ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారిస్తుందని, తద్వారా విశాఖ డిజిటల్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. ఈ క్యాంపస్‌లోని ప్రతి సీటు కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, మన యువత కలలకు, భవిష్యత్తుకు వేదిక అని అన్నారు.కాగ్నిజెంట్‌లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని 25 ఏళ్ల యువకుల్లా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, వారి నుంచి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు. రాష్ట్రంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్, విశాఖ, తెలుగు ప్రజలు గర్వపడేలా చేద్దామని అన్నారు.
Latest News