|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 05:06 AM
ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కేంద్రాల జాబితాలో కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం 16వ స్థానానికి ఎగబాకింది. ఈ ఘనత సాధించి టాప్ 30లో చోటు దక్కించుకున్న తొలి భారత నగరంగా నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ శావిల్స్ ఇండియా సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఆసియా మార్కెట్లపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తికి ఈ పరిణామం నిదర్శనమని నివేదిక పేర్కొంది.ప్రపంచంలోనే అగ్రగామి టెక్ నగరాలుగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. అయినప్పటికీ, 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన బెంగళూరు తన ప్రాధాన్యతను అంతకంతకూ పెంచుకుంటోంది. నగరంలో ఉన్న విస్తారమైన ప్రతిభావంతులు బలమైన టెక్ ఎకోసిస్టమ్స్ ఈ వృద్ధికి కారణంగా నిలుస్తున్నాయి.ఈ విషయంపై శావిల్స్ ఇండియా రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ నందన్ మాట్లాడుతూ.. "అద్భుతమైన వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక జీవనం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్న నగరాలు టెక్ ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారుతున్నాయి. బెంగళూరు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే సత్తా ఉంది" అని వివరించారు.సింగపూర్, సియోల్ వంటి ఇతర ఆసియా నగరాలు కూడా ఏఐ, సెమీకండక్టర్లు, బయోటెక్ వంటి రంగాల్లో పురోగతి సాధిస్తూ ఈ జాబితాలో ముందుకెళుతున్నాయి. బెంగళూరులో టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రీమియం ఆఫీస్ స్పేస్, నివాస గృహాలకు డిమాండ్ పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. వ్యాపార వాతావరణం, ప్రతిభ లభ్యత, సాంకేతిక బలం, జీవన ప్రమాణాలు వంటి 100 అంశాల ఆధారంగా ప్రపంచంలోని నగరాలకు ఈ ర్యాంకులను కేటాయిస్తారు.
Latest News