|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 09:17 PM
మనిషి జీవితం ఒక విలువైన బహుమతి. కానీ.. చిన్న చిన్న కారణాలు, క్షణికావేశాల వల్ల కొందరు తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు.. మృతుల కుటుంబాలకు తీరని రోదనను మిగులుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకే రోజు జరిగిన వరుస హత్యలు.. ఈ మానవత్వం లేని దారుణాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా.. ముషీరాబాద్ పరిధిలోని బాపూజీ నగర్ బస్తీలో జరిగిన దారుణం.. ప్రేమ, అనుబంధాల విలువను మంట కలిపింది.
వారాసిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్‌లో పవిత్ర (17) అనే ఇంటర్ విద్యార్థినిని ఆమెకు మేనబావ వరసయ్యే ఉమా శంకర్ అనే యువకుడు కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. పవిత్ర సమీప బంధువు అయిన ఉమా శంకర్ పెళ్లి చేసుకోవాలని కోరాడు. అయితే.. అతడు తాగుబోతు కావడంతో పాటు, టైల్స్ పనిచేసే వృత్తిలో స్థిరపడకపోవడం వల్ల పవిత్ర తల్లిదండ్రులు (తండ్రి కాంతారావు, తల్లి లక్ష్మి) , యువతి పెళ్లికి నిరాకరించారు. ఈ నిరాకరణను జీర్ణించుకోలేని ఉమా శంకర్, కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టాడు. పవిత్ర తల్లి కళ్లెదుటే.. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కత్తితో యువతి గొంతు కోసి హత్య చేశాడు.
ఈ హేయమైన చర్యకు పాల్పడిన తర్వాత ఉమా శంకర్ కత్తి, సెల్‌ఫోన్‌ను ఘటనాస్థలిలోనే వదిలేసి పరారయ్యాడు. యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ దారుణం జరిగిన కొద్ది గంటల ముందు మరో ప్రాంతంలో కూడా హత్య జరిగింది. మల్కాజిగిరిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు స్కూటీపై వెంబడించి.. కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఒకే రోజు నగరంలో ఇలాంటి రెండు హత్యలు జరగడంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.
Latest News