|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 07:41 PM
భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి ఆలయం.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా రూపుదిద్దుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) పాలక వర్గం.. ఈ నిర్మాణాలను చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు పొరుగున ఉన్న రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం పూర్తి చేసుకుని.. భక్తులకు దర్శనాలు కల్పిస్తుండగా.. తాజాగా బిహార్‌లో కూడా ఆలయ నిర్మాణం కోసం అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాట్నాలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం భూమిని కేటాయించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిపాదన మేరకు.. ఈ ప్రాజెక్ట్ కోసం బిహార్ ప్రభుత్వం మొకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. 99 సంవత్సరాల లీజుకు గానూ.. కేవలం రూ.1ని ప్రతీకాత్మక రుసుము కింద తీసుకుని మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం మొకామాను తూర్పు భారతదేశంలో ఒక కొత్త మతపరమైన, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా మార్చడానికి అవకాశం కల్పిస్తోందని వెల్లడించారు. ఆ 10.11 ఎకరాల స్థలంలో తిరుపతి తరహాలో శ్రీవారి ఆలయంతో పాటు.. ధర్మశాల, ఆధునిక పర్యాటక సౌకర్యాలతో కూడిన సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రాన్ని టీటీడీ నిర్మించనుంది.
ఈ ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రతిపాదన మేరకు వచ్చింది. బిహార్ టూరిజం విభాగం నుంచి.. టీటీడీ సహకారం కోరింది. దీంతో పాట్నా జిల్లా యంత్రాంగం.. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ శాఖ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీటీడీ ఆలయ నిర్మాణానికి అనువుగా గుర్తించింది. దీనికి బిహార్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. ఆధునిక, విశాలమైన ఆలయ సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు ఊపందుకున్నాయి.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన టీటీడీ.. దేశవ్యాప్తంగా వేద విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా పర్యవేక్షిస్తోంది. మొకామాలో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్ కేవలం సాంప్రదాయ ఆలయానికే పరిమితం కాదని.. ఇందులో ధర్మశాల, ప్రార్థనా మందిరం, రెస్టారెంట్, ఆధ్యాత్మిక కార్యకలాపాల కేంద్రం, ఆధునిక సందర్శకుల సౌకర్యాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. ఇది ఒక సమగ్ర మతపరమైన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొంది.
ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, బిహార్ మధ్య సాంస్కృతిక వారధిని నిర్మించడానికి ఒక చారిత్రక అవకాశం ఉపయోగపడుతుందని.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభివర్ణించారు. ఆలయ డిజైన్‌ను ఖరారు చేయడానికి, నిర్మాణాన్ని ప్రారంభించడానికి టీటీడీ ప్రత్యేక బృందం బిహార్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకోనుందని వెల్లడించారు.
ఈ ఆలయ నిర్మాణంతో బిహార్‌లోని గయా, రాజ్‌గిర్, వైశాలి, పాట్నా సాహిబ్ వంటి ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు ఇప్పటికే నిలయంగా ఉన్న ఆ రాష్ట్రానికి.. ఈ కొత్త ఆలయం వల్ల మరింత ప్రయోజనం చేకూరనుందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలయం పర్యాటకాన్ని పెంచడంతో పాటు.. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని.. మొకామా ప్రతిష్టను గంగా నది వెంబడి ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా పెంచుతుందని భావిస్తున్నారు.
Latest News