|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:29 PM
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) కూడా క్రీమీలేయర్ విధానాన్ని వర్తింపజేయాలని తాను ఇచ్చిన తీర్పుపై సొంత వర్గం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. రిజర్వేషన్ల ఫలాలు నిజంగా వెనుకబడిన వర్గాలకు చేరాలన్నదే తన ఉద్దేశమని ఆయన తన వైఖరిని గట్టిగా సమర్థించుకున్నారు."భారత ప్రధాన న్యాయమూర్తి కుమారుడికి, గ్రామ పంచాయతీ పాఠశాలలో చదివిన ఒక కూలీ కుమారుడికి ఒకే రకమైన కొలమానం వర్తింపజేయడం రాజ్యాంగం చెప్పిన సమానత్వం ఎలా అవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ ప్రయోజనాలు పొంది సుప్రీంకోర్టు జడ్జి అయ్యాక, ఇప్పుడు ఇతరులకు ఆ ఫలాలు అందకుండా చేస్తున్నానని తనపై ఆరోపణలు చేశారని గవాయ్ గుర్తు చేసుకున్నారు.అయితే, ఈ విమర్శలు రాజ్యాంగ నిబంధనలపై అవగాహన లేమితో చేస్తున్నారని ఆయన అన్నారు. "సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి రాజ్యాంగ పదవులకు రిజర్వేషన్లు ఉండవన్న ప్రాథమిక విషయం కూడా విమర్శించే వారికి తెలియదు. ఈ పదవులకు ఇతరులతో పోటీపడి మాత్రమే ఎంపిక కావాలి" అని ఆయన స్పష్టం చేశారు.
Latest News