|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 09:07 PM
దేశీయ విమానయాన రంగంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న గందరగోళం శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇండిగోకు చెందిన వందలాది విమాన సర్వీసుల రద్దు కావడంతో ఎదురైన పరిస్థితిని ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికులను తీవ్రంగా దోచుకుంటున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. సాధారణ ధరల కంటే ఏకంగా 3 నుంచి 10 రెట్లు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికి ఇది పెనుభారంగా మారింది.
లక్ష దాటిన టికెట్ ధరలు!
ప్రధాన నగరాల మధ్య ఒక్కరోజు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం నాటి ధరలను పరిశీలిస్తే దిల్లీ - బెంగళూరు విమాన టికెట్ ధర రూ. 1,02,000గా నమోదు కాగా.. చెన్నై - దిల్లీ మార్గంలో టికెట్ ధర రూ. 90,000కు చేరింది. అదేవిధంగా దిల్లీ - ముంబైకి ఒక టికెట్ ధర ఏకంగా రూ. 54,222 పలికింది. ఇతర విమానయాన సంస్థల టికెట్ల ధరలు కూడా రూ. 20 వేల నుంచి రూ. 40 వేల మధ్యలో కొనసాగుతున్నాయి. ముంబై - శ్రీనగర్ మార్గంలో సాధారణంగా రూ. 10 వేల లోపు ఉండే టికెట్ ధర, ఇప్పుడు రూ. 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ తీసుకుంటే దాదాపు రూ. 92 వేల వరకు ఉంటోంది.
హైదరాబాద్ మార్గంలోనూ భారీగా ధరలు
దిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాలనుకునే వారికి కూడా అధిక ధరల సెగ తగిలింది. శనివారం నాటి ప్రయాణానికి దిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమాన టికెట్ ధర రూ. 33,000కు చేరుకుంది. సాధారణ రోజుల్లో ఈ మార్గంలో టికెట్ ధర కేవలం రూ. 5,000 నుంచి రూ. 7,000 మధ్య మాత్రమే ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. డిసెంబర్ 7వ తేదీన దిల్లీ-చెన్నై ఎకానమీ క్లాస్‌లో కనీస టికెట్ ధర రూ. 53,000గా, దిల్లీ-హైదరాబాద్ కనీస ధర రూ. 25,000గా నమోదైంది. ఈ భారీ పెరుగుదల కారణంగా ప్రయాణాలు అత్యవసరం కానివారు తమ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారు.
క్షమాపణ చెప్పిన ఇండిగో, రీఫండ్ ఇస్తామని హామీ
విమాన సర్వీసుల రద్దుపై ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూ, "క్షమించండి... మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం" అని ప్రయాణికులకు సందేశం పంపింది.
Latest News