|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:45 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని తాను బలంగా విశ్వసించానని, కానీ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురిచేశాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. "కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది" అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉండవల్లి పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. "డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత అనుచితం. పవన్ ఇలా మాట్లాడటం బాధాకరం. నేను సీఎం అవుతాడని నమ్మిన వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరం" అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఉండవల్లి విమర్శలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న చంద్రబాబు తన సొంత వ్యాపారాలను, నివాసాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు మార్చడం లేదని నిలదీశారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేవలం వైసీపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతోనే ఏర్పడిందని, అందుకే విజయం సాధించిందని ఉండవల్లి విశ్లేషించారు. ఈ పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.
Latest News