|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 11:08 PM
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యంలో కొనసాగుతోంది. గబ్బా వేదికగా జరుగుతున్న డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు పట్టు సాధించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేయగా.. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆ రోజే లీడింగ్‌లోకి రావడం విశేషం.
తొలి రోజు తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు రెండో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే జోఫ్రా ఆర్చర్ వికెట్ కోల్పోయి ఆలౌట్ అయింది. ఆ వెంటనే మొదటి సెషన్‌లో ఇన్నింగ్స్‌కి వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, జేక్ వెధరాల్డ్ శుభారంభం అందించారు. పెర్త్ టెస్టు సెంచరీ హీరో హెడ్ ఈ టెస్టులో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్ - జేక్ వెధరాల్డ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.
కెప్టెన్ స్టీమ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ ఇలా అందరూ అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ చేసిన భారీ స్కోర్‌ను ఆస్ట్రేలియా అధిగమించింది. వరుసగా ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీ చేయడం విశేషం. కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ కూడా రాణించడంతో భారీ స్కోర్ దిశగా ముందుకు వెళ్తోంది.
ట్రావిస్ హెడ్ 33, జేక్ వెధరాల్డ్ 72, మార్నస్ లబుషేన్ 65, స్టీవ్ స్మిత్ 61, కామెరూన్ గ్రీన్ 45, జోష్ ఇంగ్లిస్ 23 పరుగులు చేశారు. అలెక్స్ క్యారీ 46, మైకేల్ నేసర్ 15 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 378/6 పరుగులు చేసి 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ బౌలర్లు బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు, ఆర్చర్‌కి ఒక వికెట్ దక్కాయి.
అంతకు ముందు తొలి రోజు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో మెరిశాడు. ఓపెనర్ జాక్ క్రాలీ 76 పరుగులు చేయగా, జోఫ్రా ఆర్చర్ 38, హ్యారీ బ్రూక్ 31 పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ 334 పరుగులు చేయగలిగింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు పడగొట్టగా.. నేసర్, బోలాండ్, బ్రెండన్ డాగెట్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Latest News