|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:41 PM
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు .. ఆ మాట ప్రకారం ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నిర్వహించిన చంద్రబాబు.. 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. తాజాగా డీఎస్సీపై మరో కీలక ప్రకటన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు శుక్రవారం రోజు పర్యటించిన సంగతి తెలిసిందే.
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో పాల్గొనేందుకు గానూ.. మన్యం జిల్లా బామినిలో చంద్రబాబు పర్యటించారు. బామినిలో జరిగిన పీటీఎంలో నారా లోకేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో చంద్రబాబు మాట్లాడారు. విద్యార్ధులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ పరిశీలించారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి తల్లితండ్రులతో ముచ్చటించారు.
అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నెలలోనే టెట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నారా చంద్రబాబు నాయుడు వివరించారు. ఇక విద్యార్థులు వినూత్న కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండాలని చంద్రబాబు సూచించారు. చదువుతో పాటు ఆటపాటలపైనా దృష్టి పెట్టాలన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని.. తక్కువ సమయమైనా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా క్రమంగా తగ్గుతోందని చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో మనదేశంలోనే పిల్లలు ఎక్కువగా ఉంటారని.. యువ శక్తిని మనం సరిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల బలాలు ఏమిటో.. బలహీనతలు ఏమిటో తల్లిదండ్రులతో పాటుగా ఉపాధ్యాయులు గుర్తించి.. అందులో ప్రోత్సహించాలన్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తెస్తోందని మంత్రి నారా లోకేష్ వివరించారు. విద్యార్థులలో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు, పుస్తకాలు కూడా అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఇక విద్యార్థుల కోసం క్లిక్కర్ సాంకేతికతను కూడా పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఇంగ్లండ్, ఫిన్లాండ్ వంటి దేశాలలో అత్యుత్తమ విద్యా విధానాలు అమలవుతున్నాయన్న నారా లోకేష్.. ఆ విధానాలను పరిశీలించేందుకు ఏపీ నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులను అక్కడకి పంపుతామని వెల్లడించారు. లీప్ యాప్ ద్వారా పిల్లల చదువులపై విద్యార్థుల తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంచవచ్చని వెల్లడించారు.