|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:32 PM
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన మంచి మనసు నిరూపించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సత్య కుమార్ యాదవ్. పొత్తుల లెక్కల్లో భాగంగా ధర్మవరం సీటు భారతీయ జనతా పార్టీకి దక్కింది. దీంతో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన సత్యకుమార్ యాదవ్ .. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే చంద్రబాబు మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. తాజాగా ధర్మవరం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధుల పరీక్ష ఫీజును మంత్రి చెల్లించారు.
ధర్మవరం నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. ధర్మవరం, ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి మండలాలు ఉన్నాయి. ఈ మండలాలల్లో ఉన్న 41 ప్రభుత్వ పాఠశాలల్లో 2,087 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ విద్యార్థులు అందరి తరఫున పబ్లిక్ పరీక్షల ఫీజును మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా చెల్లించారు. పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 కాగా.. 2087 మంది విద్యార్థులకు కలిపి.. మొత్తం రూ.2,60,875లను జిల్లా విద్యా శాఖ అధికారి ద్వారా మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. పదో తరగతి విద్యార్థుల ఫీజు చెల్లింపు విషయాన్ని ఈ మేరకు ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2026 మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు కోసం డిసెంబర్ ఆరో తేదీ వరకూ సమయం ఉంది. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు సంబంధించి ఇప్పటికే ఓసారి గడువు ముగియగా.. గడువును పెంచుతూ ఏపీ విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 6వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. ఆ తర్వాత అపరాధ రుసుంతో చెల్లించేందుకు అవకాశం ఉంది. డిసెంబరు 7 నుంచి 9 వరకు అయితే రూ.50 అపరాద రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. డిసెంబర్10 నుంచి 12 వరకు రూ.200 అపరాధ రుసుం, డిసెంబర్ 13 నుంచి 15 వరకు రూ.500 రుసుంతో పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది.
మరోవైపు పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థులు పేరు, ఇతర వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు వివరాలను తప్పుగా నమోదు చేస్తే.. డిసెంబరు 16 నుంచి 20 వరకు సవరించుకునే అవకాశం ఉంది.
Latest News