|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 08:15 AM
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో విపరీతంగా కురిసిన మంచు బౌలింగ్‌ను కష్టతరం చేసిందని, టాస్ ఓడిపోవడం తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ సెంచరీలతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (66 నాటౌట్) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే, ఛేదనలో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ (110) శతకంతో చెలరేగగా, మాథ్యూ బ్రీట్జ్‌కే (68), డెవాల్డ్ బ్రెవిస్ (54) రాణించడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది."ఈ ఓటమిని జీర్ణించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎంతగా ఉందంటే బౌలింగ్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. అంపైర్లు బంతిని కూడా మార్చారు. టాస్ కీలక పాత్ర పోషించింది. టాస్ ఓడిపోయినందుకు నన్ను నేనే నిందించుకుంటున్నా" అని రాహుల్ నవ్వుతూ అన్నాడు.అయితే, బౌలర్లు, ఫీల్డర్లు మరింత మెరుగ్గా ఆడాల్సిందని రాహుల్ అభిప్రాయపడ్డాడు. "350 పరుగులు మంచి స్కోరే అయినా, బౌలర్లకు మరిన్ని అదనపు పరుగులు అందించేందుకు ఇంకో 20-25 పరుగులు చేసి ఉంటే బాగుండేదని డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకున్నాం" అని తెలిపాడు. రుతురాజ్, కోహ్లీ భాగస్వామ్యం అద్భుతంగా ఉందని, ముఖ్యంగా రుతురాజ్ యాభై పరుగులు దాటాక వేగం పెంచిన తీరు ప్రశంసనీయమని అన్నాడు. తాను ఆరో స్థానంలో కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై స్పందిస్తూ.. భాగస్వామ్యం కుదిరిన సమయంలో అదే వేగాన్ని కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.
Latest News