|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 08:54 PM
2017లో అమెరికాలోని న్యూజెర్సీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల శశికళ నర్రా, 7 ఏళ్ల ఆమె కుమారుడు అనీష్ సాయి దారుణ హత్య కేసులో అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నజీర్ హమీద్ ఆచూకీ తెలిపిన వారికి 50,000 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 41 లక్షలు) రివార్డు అందిస్తామని ప్రకటించింది.
అసలేం జరిగిందంటే?
2017 మార్చిలో నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని తన భార్య శశికళ, కుమారుడు అనీష్ సాయితో కలిసి జీవించేవాడు. అయితే ప్రతీ రోజులాగే ఉద్యోగానికి వెళ్లిన హనుమంతరావు.. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి.. తమ అపార్ట్‌మెంట్‌లో భార్య శశికళ, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇది చూసిన హనుమంతరావు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓవైపు గుండెలు బాదుకుంటూనే మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మొదట్లో మృతురాలి బంధువులు భర్త హనుమంతరావే హత్య చేశాడని ఆరోపించారు. అతడికి వివాహేతర సంబంధం ఉందని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, డీఎన్‌ఏ పరీక్షల్లో హనుమంతరావుకు ఈ హత్యల్లో ప్రమేయం లేదని తేలడంతో విడుదల చేశారు. దర్యాప్తులో భాగంగా హనుమంతరావు సహోద్యోగి అయిన నజీర్ హమీద్‌తో హనుమంతరావుకు భేదాభిప్రాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హమీద్ కోణంలో దర్యాప్తు చేస్తున్న సమయంలోనే.. హత్య జరిగిన ఆరు నెలల అనంతరం అతడు భారత్‌కు పరారైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హమీద్ ల్యాప్‌టాప్ నుంచి సేకరించిన డీఎన్‌ఏ, హత్య జరిగిన ప్రాంతంలో లభించిన డీఎన్‌ఏతో సరిపోలడంతో.. అతడే నిందితుడని అమెరికా పోలీసులు ఇటీవల ప్రకటించారు.
ప్రస్తుతం హమీద్ భారత్‌లోనే ఉన్నాడని భావిస్తున్న అమెరికా అధికారులు అతడిని తిరిగి అమెరికాకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హమీద్ అరెస్టుకు సంబంధించిన వారెంట్‌ను ఎఫ్‌బీఐ జారీ చేసింది. ఇటీవల న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ, అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాశారు. ఈ దారుణమైన హత్య తమ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని.. భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా హమీద్ అప్పగింతకు సహకరించాలని కోరారు. హత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితరాలి భర్త హనుమంతరావు కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు బర్లింగ్‌టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.