|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 08:08 PM
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ 2025-26 ప్లేస్‌మెంట్స్ సీజన్‌లో అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ ప్రారంభమైన తొలి రోజే ఈ క్యాంపస్ చరిత్రలోనే అత్యధికంగా 672 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఆఫర్లు సంపాదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఐఐటీ కాన్పూర్ అధికారికంగా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది.
రికార్డు స్థాయిలో డిమాండ్
గతేడాది తొలి రోజు నమోదైన ఆఫర్ల సంఖ్యతో పోలిస్తే ఈసారి 16 శాతం అధికంగా ఉద్యోగ ఆఫర్లు రావడాన్ని ఐఐటీ కాన్పూర్ హైలైట్ చేసింది. ఇది తమ విద్యార్థుల ప్రతిభకు, ప్రపంచ వ్యాప్తంగా వారి నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌కు ప్రత్యక్ష నిదర్శనమని సంస్థ పేర్కొంది. తొలి రోజు సాధించిన 672 ఆఫర్లలో.. 253 ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఉండటం విశేషం. ఇది విద్యార్థుల అకాడమిక్ నైపుణ్యంతో పాటు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వారి పని తీరును కంపెనీలు ముందుగానే గుర్తించాయి అనడానికి రుజువు.
అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యం
ఈ రికార్డ్ బ్రేకింగ్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో తొమ్మిది అంతర్జాతీయ కంపెనీలతో సహా 250కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న వాటిలో యాక్సెంచర్ (Accenture), బ్లాక్ రాక్ (Black Rock), హెచ్‌ఎస్‌బీసీ (HSBC), సాప్ (SAP), ఎయిర్‌బస్ (Airbus), పీడబ్ల్యూసీ (PwC), నవి (Navi), క్వాల్కమ్ (Qualcomm), డ్యూయిష్ బ్యాంక్ (Deutsche Bank) వంటి అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి.
ఈ అద్భుతమైన రికార్డు సాధించిన సందర్భంగా.. ఐఐటీ కాన్పూర్ యాజమాన్యం విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి, క్రియాశీలంగా పని చేసిన స్టూడెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీస్‌కు (SPO) తమ శుభాకాంక్షలు తెలియజేసింది. "ఈ ప్రయాణం కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు రిక్రూట్‌మెంట్‌కు రాబోతున్నాయి. మా విద్యార్థులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తాయి" అని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఐఐటీ కాన్పూర్ సాధించిన ఈ ఘనత.. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక విద్యా సంస్థల్లోని యువ ఇంజనీర్ల ప్రతిభకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపును మరోసారి నిరూపించింది.
Latest News