|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:48 PM
పైరసీ ప్రపంచంలో సాంకేతికతను వినియోగించి సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ‘ఐ బొమ్మ’ రవికి పోలీసులు ఆశ్చర్యకరమైన ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. రవిలోని మెదడు, టెక్నికల్ స్కిల్స్‌ను గమనించిన పోలీస్ ఉన్నతాధికారులు విచారణ సందర్భంగా.“పోలీసు శాఖలో చేరతావా? సైబర్ క్రైమ్ విభాగంలో పని చేసే అవకాశంతో పాటు ఆకర్షణీయమైన జీతం కూడా ఇస్తాం”అని అడిగినట్లు తెలిసింది. అయితే రవి మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.కస్టడీలో రవిని ప్రశ్నించిన అధికారులు అనేక కీలక విషయాలను బయటకు తెచ్చినట్టు సమాచారం. “నీ iBomma క్లోజ్ అయింది… ఇక ప్లాన్ ఏమిటి?” అని అడిగితే—కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ ప్రారంభించి, తెలంగాణ–ఆంధ్రా ప్రత్యేక వంటకాలతో పాటు భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని రవి తెలిపినట్టుగా తెలుస్తోంది.రెస్టారెంట్‌కు ఏ పేరు పెడతావని ప్రశ్నించగా “ఐ బొమ్మ’ అనే పేరునే పెట్టేస్తాను”అని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. కేవలం ఒక చోట మాత్రమే కాదు, త్వరలోనే కరేబియన్ దీవుల్లోని పలు దేశాల్లో ‘iBomma రెస్టారెంట్’ శాఖలను ప్రారంభిస్తానని కూడా రవి చెప్పినట్టు సమాచారం.“జీవితాన్ని ఆస్వాదించడమే లక్ష్యం” – రవి ఐ బొమ్మ రెస్టారెంట్ ద్వారా వచ్చే ఆదాయంతో సుఖసంతోషాలతో జీవించడం తన ప్రధాన లక్ష్యమని రవి విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. లక్ష డాలర్లు (సుమారు రూ.80 లక్షలు) వెచ్చించి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటివరకు సంపాదించిన రూ.20 కోట్లలో దాదాపు రూ.17 కోట్లు టూర్‌లు, లగ్జరీ లైఫ్ కోసం ఖర్చు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇకపై కూడా వారానికో దేశం తిరుగుతూ తన ఇష్టానుసారం జీవిస్తానని రవి చెప్పినట్టు సమాచారం.రవికి సంబంధించిన రూ.3 కోట్ల నగదు, హైదరాబాద్‌లోని ఫ్లాట్, విశాఖలోని ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే అతనికి బెయిల్ రావచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Latest News