|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:10 PM
అమెరికాలో కొన్ని మిలియన్ డాలర్ల విలువైన మెడికేర్ మోసానికి పాల్పడిన కేసులో భారత జాతీయుడు మహ్మద్ అసిఫ్ (35)కు అక్కడి ఫెడరల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు, మోసం చేసిన 1,174,813 డాలర్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.వాషింగ్టన్‌లోని ఎవరెట్‌లో ‘అమెరికన్ ల్యాబ్‌వర్క్స్’ అనే డయాగ్నస్టిక్ ల్యాబ్ పేరుతో అసిఫ్ ఈ భారీ మోసానికి తెరలేపాడు. కరోనా, ఇతర శ్వాసకోశ సంబంధిత పరీక్షలు చేయకుండానే చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి మెడికేర్ నుంచి నిధులు పొందాడు. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఈ ల్యాబ్ ఏకంగా 8.7 మిలియన్ డాలర్లకు పైగా బిల్లులు చేయగా, 1.1 మిలియన్ డాలర్లకు పైగా చెల్లింపులు పొందింది.ఈ మోసం తీరు అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. లబ్ధిదారులు తమకు ఎలాంటి పరీక్షలు చేయలేదని ఫిర్యాదు చేశారు. కొందరు వైద్యులు తాము ఏ రోగినీ ఆ ల్యాబ్‌కు సిఫార్సు చేయలేదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వారి పేర్ల మీద కూడా టెస్టులు చేసినట్లు, మరణించిన వైద్యుల పేర్లతో సిఫార్సులు ఉన్నట్లు బిల్లులు సృష్టించారు.ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన అసిఫ్, ల్యాబ్ బ్యాంకు ఖాతాను తన నియంత్రణలో ఉంచుకొని భారీగా నగదును విత్‌డ్రా చేశాడు. మే 2024లోనే 2,60,000 డాలర్లు తీసుకున్నాడు. అనంతరం దర్యాప్తు జరుగుతుండగానే భారత్‌కు పారిపోయాడు. తిరిగి మార్చి 2025లో అమెరికాకు రాగానే షికాగో ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Latest News