|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:51 PM
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. ఇటీవల వీరికి సంబంధించి ఎన్నో వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. 8వ వేతన సంఘం సిఫార్సుల్లో.. పెన్షన్ సవరణ అంశం లేదని.. దీనికి సంబంధించి విధివిధానాల్ని ప్రస్తావించలేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 8వ వేతన సంఘం విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి.. ఎన్నో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల యూనియన్లు.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశారు. 8వ వేతన కమిషన్ విధివిధానాల్ని సవరించాలని.. పెన్షన్ రివిజన్ (సవరణ) టాపిక్ కూడా చేర్చాలని కోరాయి.
దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. డిసెంబర్ 2న రాజ్యసభలో క్లారిటీ ఇచ్చేసింది. 8వ వేతన సంఘం వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుందని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సవరణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పొచ్చు.
పార్లమెంటులో ఎంపీలు జావేద్ అలీ ఖాన్, రామ్‌జీ లాల్ సుమన్.. పై వాటి గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నించగా.. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ స్పందించారు. 8వ వేతన సంఘం కింద పెన్షన్ సవరణను ఎందుకు ప్రతిపాదించలేదని క్వశ్చన్ చేశారు. దీనిపై బదులిచ్చిన చౌదరీ.. 8వ వేతన కమిషన్ అన్ని అంశాలకు సంబంధించి సిఫార్సులు చేస్తుందని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ ఉంటాయని పేర్కొన్నారు.
జావేద్ అలీ ఖాన్, సుమన్ మరో ప్రశ్న కూడా సంధించారు. ప్రస్తుత డియర్‌నెస్ అలవెన్స్ (కరవు భత్యం), డియర్‌నెస్ రిలీఫ్‌ను (DR).. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణ ఉపశమన చర్యగా.. బేసిక్ పేలో ప్రభుత్వం విలీనం చేస్తుందా అని ప్రశ్నించారు. దీనికి కూడా బదులిచ్చిన పంకజ్ చౌదరీ.. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి ప్రతిపాదన లేదని వెల్లడించారు.
సాధారణంగా డీఏ 50 శాతం దాటితే.. బేసిక్ పేలో విలీనం చేస్తుంటారు. ఈ క్రమంలోనే 2024 జనవరిలోనే డీఏ 50 శాతం అధిగమించగా.. అప్పుడే పలు ఉద్యోగ సంఘాలు.. డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. డీఏను కనీస వేతనంలో విలీనం చేస్తే.. అప్పుడు 8వ వేతన సంఘం సిఫార్సులకు ముందే బై హ్యాండ్ శాలరీ పెరుగుతుందని అంచనా వేశారు. కానీ అలాంటిదేం జరగలేదు.
Latest News