|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 08:51 PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి .. తన పెంపుడు కుక్కతో సహా పార్లమెంట్ ఆవరణలోకి రావడం తీవ్ర చర్చకు, వివాదానికి దారి తీసింది. అత్యంత భద్రత కలిగిన పార్లమెంటు ప్రాంగణంలోకి వ్యక్తిగత పెంపుడు జంతువును తీసుకురావడంపై వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై రేణుకా చౌదరి స్పందించారు. తన కుక్క చాలా చిన్నదని.. అది ఎవరినీ కరవదని పేర్కొన్నారు. అంతేకాకుండా.. కరిచేవాళ్లు పార్లమెంట్‌లో లోపల ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పార్లమెంట్‌లో తన పెంపుడు కుక్కను తీసుకురావడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు రేణుకా చౌదరి బదులిచ్చారు. పార్లమెంటులో భద్రతా నిబంధనల ఉల్లంఘనపై స్పందించిన రేణుకా చౌదరి.. మనం ఏ భద్రతా సమస్య గురించి మాట్లాడుకుంటున్నామని.. ఈ చిన్న కుక్క ఎవరినీ కరవదని.. కరిచేవాళ్లు ఎవరైనా ఉంటే అది కుక్క కాదని.. పార్లమెంటు లోపల ఉన్న కొందరు మనుషులేనని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక రేణుకా చౌదరి చేసిన పనిని.. బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హక్కుల పేరుతో పార్లమెంటు నిబంధనలను ఉల్లంఘించి ఎవరూ పెంపుడు జంతువులను సభలోకి తీసుకురావడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో సభ్యులకు జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు. ఇది ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయడమేనని.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రేణుకా చౌదరి ఘటనతో రాజకీయ వేడి రాజేసినప్పటికీ.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు.. 19 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే ఈసారి శీతాకాల సమావేశాలు తక్కువ రోజులు జరపడంపై.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.
ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 13 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వీటిలో అణుశక్తి బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు, కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు, బీమా చట్టాల (సవరణ) బిల్లు వంటివి ఉన్నాయి. అదే సమయంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అటు ప్రతిపక్షాలు కూడా సిద్ధం అయ్యాయి. ఓటర్ల జాబితా సవరణ, ఆర్థిక అసమానత, ఢిల్లీ పేలుడు, కాలుష్యం, విదేశాంగ విధానం వంటి పలు కీలక అంశాలపై చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి. ఈ సెషన్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Latest News