|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:34 PM
పేద ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటాయి. విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అయితే ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు.. లేదా ప్రమాదం జరిగి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. వైద్య చికిత్సలు పొందడం పేద, మధ్యతరగతి జీవులకు తలకు మించిన భారంగా మారుతుంటుంది. కుటుంబసభ్యులను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తులను కూడా తెగనమ్ముకుని ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేవారెందరో మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే అలాంటి పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలుస్తోంది ముఖ్యమంత్రి సహాయ నిధి. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి అవగాహన లేక చాలా మంది దాని లబ్ధి అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి సాయం ఎలా పొందాలనేదీ ఇప్పుడు చూద్దాం.
అన్ని పత్రాలు సరిగా ఉంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం పొందడం సులువు అని అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవల కింద పలు వైద్య చికిత్సలు అందిస్తోంది. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం పొందాలంటే ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని ఉపయోగించి ఉండకూడదు. అలాగే చికిత్స కోసం సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ఉండాలి. ఇలాంటి వారు తమ సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలను లేదా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం పొందేందుకు సదరు వ్యక్తులు కొన్ని ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఇన్ కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్సులు కావాల్సి ఉంటుంది. అలాగే పేషెంట్ వ్యాధిని నిర్ధారించే స్కానింగ్, ఎక్స్‌రే వంటి పరీక్షల తాలూకు రిపోర్టులు, ఆస్పత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పేషెంట్‌కు ఏయే చికిత్సలు అందించారనే వివరాలనుు, వాడిన ఔషధాలు, డాక్టర్ సంతకం, స్టాంప్ వేసి ఉన్న డిశ్చార్జ్ సమ్మరీ సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలు అన్నీ సరిగా ఉంటే.. ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం పొందడం సులువేనని అధికారులు చెప్తున్నారు.
Latest News