|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:31 PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం రోజున ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో మంగళవారం రోజున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
మరోవైపు సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకూ నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం కురిసింది. నెల్లూరు జిల్లా కొడవలూరులో 38.7మిమీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరులో36.7మిమీ, తిరుపతి జిల్లా తడలో33.5మి మీ వర్షం కురిసినట్లు తెలిపింది.
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలోని దిత్వా తుఫాను బలహీనపడి తీవ్రవాయుగుండం మారింది. రాబోయే మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో వచ్చే మూడురోజులు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు దిత్వా తుఫాను కారణంగా తిరుమలతో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. అలాగే శ్రీకాళహస్తిలోనూ ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అటు తుఫాను ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
తుఫాను ఎఫెక్ట్.. నెల్లూరులో భారీ వానలు
మరోవైపు దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై పడింది. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి నెల్లూరు నగరంలో ఎడతెరిపి లేకుండా వాన పడింది. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్, కనమహాల్ సెంటర్ వంటి ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరింది. దీంతో వాహనదారుల ఇబ్బందిపడ్డారు. తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో వరినాట్లు వేసే రైతులు అందేళన చెందుతున్నారు.
Latest News