|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 06:59 PM
ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నర్మించుకోవాలనే ఆకాంక్షతో తాను కోరితే ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతును అందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు తమ బాధ్యతను మరింత పెంచారని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన 'పేదల సేవలో' ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు సూపర్ సిక్స్‌ను ఎగతాళి చేశారని, అయితే ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపించామని అన్నారు. గత 18 నెలల్లో పెన్షన్ల కోసమే రూ. 50,763 కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. సంక్షేమం కోసం దేశంలో ఎవరూ ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని ఆయన తెలిపారు.ప్రతి ఏడాది రూ. 33 వేల కోట్ల చొప్పున ఐదేళ్ల కూటమి ప్రభుత్వం హయాంలో రూ.1.65 లక్షల కోట్ల మేర వ్యయం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతీ నెల 63 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 59 శాతం మంది మహిళలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పెన్షన్లను ఎన్టీఆర్ ప్రారంభించగా, తమ ప్రభుత్వం వాటిని మరింత పెంచిందని ఆయన అన్నారు.గత పాలకులు పెన్షన్‌ను కేవలం రూ.250 మాత్రమే పెంచారని, కానీ కూటమి ప్రభుత్వం ఒకేసారి రూ. 4 వేల పెన్షన్‌ను ప్రకటించి అమలు చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డలు కష్టపడవద్దనే ఉద్దేశంతో ఏడాదికి 3 నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్‌లను అందిస్తున్నట్లు చెప్పారు. రైతులు ధాన్యం విక్రయించిన ఐదారు గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామని అన్నారు.స్త్రీ శక్తి ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు మహిళలు 25 కోట్ల ప్రయాణాలు చేశారని, దీనికి రూ.855 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని వెల్లడించారు. 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.14 వేలు జమ చేశామని ఆయన అన్నారు. పంచసూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా కార్యాచరణను చేపట్టామని, ప్రతి రైతును కలిసి అవగాహన కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపీనాథపట్నం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మికి పెన్షన్ అందించారు. తమ ఇంటికి ముఖ్యమంత్రి వస్తున్నారన్న సమాచారంతో నాగలక్ష్మీ కొడుకు, కూతురు నాగపవన్, వాసవి చంద్రబాబుకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. నాగపవన్, వాసవి చదువు వివరాలను గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న నాగలక్ష్మీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్‌కు సూచించారు. నాగలక్ష్మీ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
Latest News