|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:02 PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌కు, పార్టీ అధిష్ఠానానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పార్టీ నిర్వహించిన రెండు కీలక సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరు కావడంతో, ఆయన కాంగ్రెస్‌ను వీడతారనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోనియా గాంధీ నివాసంలో నిన్న సాయంత్రం జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి థరూర్ హాజరుకాలేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. తాను కేరళలో వృద్ధాప్యంలో ఉన్న తల్లితో ఉన్నందున సమావేశానికి రాలేకపోయానని థరూర్ మీడియాకు తెలిపారు.అయితే, నవంబర్ 18న జరిగిన మరో కీలక సమావేశానికి కూడా ఆయన అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. కానీ, అంతకుముందు రోజే ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరై, మోదీని ప్రశంసించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Latest News