|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 08:14 PM
టెక్ దిగ్గజం అమెజాన్‌లో కృత్రిమ మేధస్సు అభివృద్ధి విధానాలపై సొంత ఉద్యోగులే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ అనుసరిస్తున్న అతివేగమైన ఏఐ వ్యూహం పర్యావరణానికి, ఉద్యోగాలకు, ప్రజాస్వామ్యానికి పెను ముప్పు కలిగిస్తుందని హెచ్చరిస్తూ సీఈఓ ఆండీ జాస్సీకి, యాజమాన్యానికి వేలాది మంది ఉద్యోగులు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై ఇప్పటివరకు 1,039 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేశారు. వీరిలో ఏఐ వ్యవస్థలను డెవలప్ చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, వేర్‌హౌస్ సిబ్బంది కూడా ఉన్నారు.లేఖలో ఉద్యోగులు మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు. ఏఐ అభివృద్ధి కోసం అమెజాన్ డేటా సెంటర్లపై 150 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని, కానీ ఈ సెంటర్లు కర్బన ఉద్గారాలను పెంచుతున్నాయని ఆరోపించారు. 2040 నాటికి 'నికర-సున్నా' ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, కంపెనీ ఉద్గారాలు 2019 నుంచి 35 శాతం పెరిగాయని గుర్తుచేశారు. మరోవైపు, చమురు, గ్యాస్ కంపెనీలకు ఏఐ సేవలు అందిస్తూ శిలాజ ఇంధనాల వెలికితీతను ప్రోత్సహించడంపై అభ్యంతరం తెలిపారు.ఇటీవల 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఏఐ కారణంగా మిగిలిన వారిపై పనిభారం పెరిగిందని, నిఘా ఎక్కువైందని ఉద్యోగులు వాపోయారు. ఏఐ 'ఏజెంట్లు' మానవ ఉద్యోగాలను తగ్గిస్తాయని సీఈఓ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, ఇది ఉద్యోగులలో అభద్రతను పెంచుతోందని పేర్కొన్నారు. "ఏఐని అభివృద్ధి చేసేది, వినియోగించేది మేమే కాబట్టి, జోక్యం చేసుకోవడం మా బాధ్యత" అని ఉద్యోగులు తమ లేఖలో స్పష్టం చేశారు.
Latest News