|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:23 PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. రేపట్నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే ఈసారి కేవలం 15 సిట్టింగ్‌లు రోజులు మాత్రమే.. పార్లమెంటు సమావేశాలు నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పార్లమెంట్‌ను నియంత్రించాలని చూస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అఖిలపక్ష సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల భద్రత, ఢిల్లీ పేలుడు, విదేశాంగ విధానాలు, ఆర్థిక పర్యావరణ భద్రత వంటి కీలక అంశాలపై చర్చకు ఈ సమావేశంలో ప్రతిపక్షాలు.. డిమాండ్ చేశాయి. మరోవైపు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఈ సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సిద్ధం అవుతోంది. వీటిలో అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచే అణుశక్తి బిల్లు 2025, ఉన్నత విద్యలో పర్యవేక్షణ కోసం ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025 వంటి కీలక బిల్లులు ఉన్నాయి. ఈ స్వల్పకాలిక సమావేశాలు.. శాసనపరమైన ఆశయాలు, రాజకీయ ఘర్షణల మధ్య ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్ సహా పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున జైరామ్ రమేష్, గౌరవ్ గొగోయ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా వంటి నేతలు హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణలకు సంబంధించిన వాటిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
భారతదేశ విదేశాంగ విధానం ఇతర దేశాల ప్రభావంతో రూపొందించబడుతోందనే ఆందోళనలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ఆరోగ్య భద్రతపై చర్చించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
దేశ ఆర్థిక పరిస్థితిపై ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేవలం 15 రోజులకే పరిమితం చేయడంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బహుశా అత్యంత తక్కువ కాలం జరిగే శీతాకాల సమావేశాలు ఇవే కావచ్చని ఎద్దేవా చేశారు. ఇలా చేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును అడ్డుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని నాశనం చేయాలని చూస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విపక్షాలన్నీ ఏకతాటిపై ఉండి ఖండిస్తున్నాయని గౌరవ్ గొగోయ్ తెలిపారు.
ప్రభుత్వ అజెండా: 14 బిల్లులు
ప్రతిపక్షాల నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా.. ఈ స్వల్పకాల సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ఆమోదింపజేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెషన్‌లో ప్రవేశపెట్టబోయే ప్రధానమైన బిల్లులను కూడా ఇప్పటికే తెలిపింది.
అణుశక్తి బిల్లు, 2025
అణుశక్తి వినియోగాన్ని నియంత్రిస్తూనే.. అణు రంగంలో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించడం దీని లక్ష్యం.
ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025
దేశంలోని యూనివర్సిటీలకు స్వయంప్రతిపత్తిని ప్రోత్సహించడం.. పారదర్శక గుర్తింపు విధానాలు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి బలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని ఉద్దేశం.
ఇతర ముఖ్య బిల్లులు
జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు.. దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ (సవరణ) బిల్లు.. కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు.. బీమా చట్టాల (సవరణ) బిల్లు, జాతీయ రహదారుల (సవరణ) బిల్లు వంటివి కూడా కేంద్ర ప్రభుత్వ అజెండాలో ఉన్నాయి. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చలు నిర్మాణాత్మకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేలా నేతలు సహకరించాలని.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో పనిచేయడం దేశానికి ప్రయోజనకరమని కోరారు.
Latest News