|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:04 PM
ఆసియా ఖండంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. అటు అనకాపల్లి నుంచి ఇటు భోగాపురం వరకూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే విశాఖను మాత్రం ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విశాఖలో పెరుగుతున్న జనాభాకు తోడుగా వాహనాల సంఖ్య పెరగటం , మౌలిక సదుపాయాలు కొరత దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అలాగే విశాఖ పోర్టు ప్రాంతం కావటంతో.. పోర్టు, పారిశ్రామిక ప్రాంతాల వద్ద క్రేన్లు, భారీ ట్రక్కులు తిరుగుతూ ఉంటాయి. దీంతోనూ వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఇరుకైన రహదారులు, జంక్షన్లు కూడా విశాఖలో ట్రాఫిక్ సమస్యకు కారణమనే వాదన ఉంది. సిగ్నల్ సమన్వయం లేకపోవటంతో పాటుగా రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో జాప్యం కూడా కారణమేనన్న విమర్శలు ఉన్నాయి. ఇక విశాఖలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు అస్త్రం యాప్ వంటి టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణంపై అధికారులు ఫోకస్ పెట్టారు.
అయితే విశాఖవాసులను ట్రాఫిక్ సమస్యలతో పాటు మరో సమస్య కూడా వేధిస్తోంది. అదే పార్కింగ్ సమస్య. సరైన పార్కింగ్ సదుపాయాలు లేక చాలాచోట్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జగదాంబ జంక్షన్, విశాఖ కేజీహెచ్, విశాఖ కలెక్టరేట్లతో పాటుగా ఇతర గవర్నమెంట్ ఆఫీసుల వద్ద కూడా పార్కింగ్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యకు ప్రస్తుతం కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పొచ్చు. పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రూ.11 కోట్లతో జగదాంబ జంక్షన్ వద్ద మల్టీలెవల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది అందుబాటులోకి వచ్చింది.
ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌ను ఐదు అంతస్తులతో ఏర్పాటు చేశారు. ఇనుప గ్రిల్స్‌తో తయారు చేసి, వాహనాల పార్కింగ్ కోసం హైడ్రాలిక్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయం వద్ద కూడా ఇదే తరహాలో మల్టీ లెవల్ కారు పార్కింగ్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్‌లో వాహనానికి గంటకు 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. మొదటి గంటను 40 రూపాయలు.. ఆ తర్వాతి నుంచి ప్రతి గంటకూ 20 రూపాయలు చొప్పున అద్దె నిర్ణయించారు. వాహనదారుల సౌలభ్యం కోసం 3 వేల 500 రూపాయలతో నెలవారీ పార్కింగ్ పాస్ కూడా అందుబాటులోకి తెచ్చారు.
Latest News