|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 04:18 PM
భారత టెస్టు క్రికెట్ జట్టు ఇటీవలి కాలంలో వరుసగా ఓటములు చవిచూస్తూ కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కుకుంది. ఆస్ట్రేలియాలో ౩-౧తో ఓడిపోయిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, ఇంగ్లండ్‌లో సిరీస్ ఓటమి, ఇంటి వేదికపై న్యూజిలాండ్‌కు ౩-౦తో చిత్తు కావడం… ఈ మూడు పెను దెబ్బలు టీమిండియా ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పుడు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని తాజా సమాచారం.
సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టీమ్ పూర్తిగా కుదేలైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా వంటి అనుభవజ్ఞులు ఒక్కొక్కరిగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో మధ్య ఆర్డర్, స్పిన్ బౌలింగ్, లీడర్‌షిప్ – అన్నీ ఒకేసారి కుప్పకూలాయి. ఫలితంగా యువ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని విశ్లేషకులు ఒప్పుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ ఇప్పుడు అత్యంత ధైర్యమైన నిర్ణయం తీసుకోబోతోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం… విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా బీసీసీఐ అధికారికంగా కోరబోతోంది. కోహ్లీ సైతం తన నిర్ణయాన్ని మళ్లీ పునరాలోచించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై తుది నిర్ణయం త్వరలోనే రానుంది.
టీమిండియా టెస్టు భవిష్యత్తు ఇప్పుడు ఒక్క కోహ్లీ చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు. రిటైర్మెంట్ తీసుకున్నా… లేదా మళ్లీ తిరిగి వచ్చి జట్టును ఆదుకున్నా… కింగ్ కోహ్లీ తదుపరి అడుగు భారత క్రికెట్‌ను కొత్త దిశలో పయనింపజేయబోతోంది!