|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 12:30 PM
వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచుకోవడమే లక్ష్యంగా, పీపీపీ పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే, మెడికల్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు, అధికారంలోకి వచ్చాక దాన్ని కేవలం 50 శాతానికే పరిమితం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. మిగతా 50 శాతం సీట్లను, బీ, సీ కేటగిరీల్లో మేనేజ్‌మెంట్‌తో పాటు, ఎన్నారై కోటా కింద భర్తీ చేసేలా క్యాబినెట్‌లో తీర్మానించడం విద్యార్థులను దగా చేయడమేనని ఆక్షేపించారు. పైగా మెడికల్ కాలేజీల భూములను ఎకరా రూ.100కే లీజుకి ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా దోచిపెట్టడమేనని తేల్చి చెప్పారు. ఇంకా ఎన్నికల ముందు జగన్‌గారు హెచ్చరించినట్లుగా, ఇది కచ్చితంగా దోచుకో..తినుకో..పంచుకో (డీపీటీ) విధానమే అని గుర్తు చేశారు. 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని చెప్పారు. అందుకే దాన్ని చూసైనా ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కోరారు.
Latest News