|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 08:25 PM
టర్కీ తీరంలో రష్యాకు చెందిన రెండు ట్యాంకర్లపై కొద్ది గంటల వ్యవధిలోనే దాడి జరిగింది. శుక్రవారం రాత్రి ఒక ట్యాంకర్‌పై, శనివారం ఉదయం మరో ట్యాంకర్‌పై మానవరహిత ఆయుధాలు దాడి చేశాయని టర్కీ తెలిపింది. ఈ దాడులకు పాల్పడింది ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. విరాట్ అనే ట్యాంకర్‌పై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. ఆ తర్వాత శనివారం ఉదయం మళ్లీ మానవరహిత నౌకలు దాడి చేశాయని టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిలో విరాట్ ట్యాంకర్‌కు స్వల్పంగా నష్టం వాటిల్లింది. అయితే, ట్యాంకర్ స్థిరంగా ఉందని, సిబ్బంది క్షేమంగా ఉన్నారని పేర్కొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
‘నల్ల సముద్రంలోని సుమారు 35 మైళ్ల దూరంలో మానవరహిత నౌకలు దాడికి విరాట్ గురైందని నివేదికలు వచ్చాయి.. ఈ ఉదయం మళ్లీ మానవరహిత నౌకల దాడికి గురైంది. విరాట్ కుడి వైపున స్వల్పంగా దెబ్బతింది’ అని టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, కైరోస్ అనే మరో రష్యా ట్యాంకర్‌లో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, నేవీ ప్రయత్నాలు చేస్తున్నాయి. కైరోస్ ట్యాంకర్‌లోని 27 మంది సిబ్బందిలో 25 మందిని సురక్షితంగా బయటకు తరలించారు.
కైరోస్ రష్యాలోని నోవోరోసిస్క్ పోర్ట్‌కు వెళ్తుండగా టర్కీ తీరానికి 28 నాటికల్ మైళ్ల దూరంలో శుక్రవారం గుర్తుతెలియని డ్రోన్ దాడులతో మంటలు చెలరేగినట్లు నివేదించింది ఎల్‌ఎస్‌ఈజీ డేటా ప్రకారం.. కైరోస్, విరాట్ ఈ రెండు ట్యాంకర్లు 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై విధించిన ఆంక్షల జాబితాలో ఉన్నాయని సమాచారం. ఉక్రెయిన్- రష్యాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. నవంబరు 24న సోమవారం రాత్రి 22 క్షిపణులు, 460 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పదులు సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. అటు, కీవ్ కూడా ప్రతీకార దాడులు చేపట్టింది. రష్యా దక్షిణ రోస్తోవ్ ప్రాంతంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడిచేయగా.. ముగ్గురు చనిపోయారు. రష్యా దాడిలో రాజధాని కీవ్‌లోని పోర్టులు, విద్యుత్, తాగునీటి సరఫరా వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య దాదాపు నాలుగేళ్ల నుంచి కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయన శాంతి ప్రణాళిక ప్రతిపాదించారు.