|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:21 PM
రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అనేక ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే అమరావతిలో రెండో దశ భూ సమీకరణకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి రెండో విడత భూ సమీకరణకు ఆమోదం లభించింది. ఏడు గ్రామాల పరిధిలో 16666 ఎకరాలను సమీకరించాలనే ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిరింది. ఓ వైపు అమరావతిలో రెండో దశ భూ సమీకరణపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం.. మరోవైపు రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించడంపైనా దృష్టి పెట్టింది. అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నేతృత్వంలో ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ త్రిసభ్య కమిటీ శనివారం సమావేశమైంది. అమరావతి సీఆర్‌డీఏ కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. గ్రామ కంఠాలు, అసైన్డ్ లంక భూములు, జరీబు- మెట్ట భూముల అంశంతో పాటుగా అమరావతి రైతులకు హెల్త్ కార్డులు, పింఛన్లపైనా చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన కేంద్ర మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్.. ఇప్పటికే 38 వేల మంది హెల్త్ కార్డులు ఇచ్చామని గుర్తుచేశారు.
వారిలో పదివేల మంది ఆరోగ్య కార్డులను ఉపయోగించుకున్నారన్నారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించి హెల్త్ కార్డులు, పింఛన్ల సమస్యలను నెలలోపు పరిష్కరిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 200 కేవీ, 400 కేవీ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఇందుకోసం టెండర్లు పిలిచినట్లు వివరించారు. 2026 అక్టోబర్ 8వ తేదీ నాటికి 400 కేవీ లైన్లు పూర్తిచేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
మరోవైపు అమరావతి ప్లాట్ల కేటాయింపులో కొంతమంది సమస్యలు వచ్చాయని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. కోర్టులలో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకూ ఓపికగా వ్యవహరించాలని సూచించారు. హెల్త్ కార్డులో మార్పులు చేర్పులకు అమరావతి రైతులకు అవకాశం కల్పిస్తామని.. నెల రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని నారాయణ హామీ ఇచ్చారు.. మరోవైపు గ్రామ కంఠాలు, జరీబ్ భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నట్లు నారాయణ వివరించారు. రూల్స్ అతిక్రమించి గ్రామ కంఠాలు పొందిన వారి నుంచి ఆ భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించారు. దీనికి సంబంధించిన కార్యాచరణను కలెక్టర్. ఇతర అధికారులు రూపొందించారన్నారు.
Latest News