|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:08 PM
రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన పంటలను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా రైతులకు రాయితీలు, సబ్సిడీలు అందిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను రాయితీ మీద అందిస్తూ ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో క్లస్టర్ విధానం లో హార్టీకల్చర్ ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్లస్టర్ విధానంపై రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. క్లస్టర్ విధానం కింద పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. క్లస్టర్ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ముందుకు వచ్చేఉద్యాన రైతులతో దరఖాస్తులు చేయిస్తున్నారు.
క్లస్టర్ విధానం కింద. రూ.కోట్లు పెట్టుబడి వ్యయం పెట్టగల సామర్త్యం ఉన్నవారిని గుర్తిస్తున్నామని.. వారితో దరఖాస్తు చేయిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే వారికి ప్రాజెక్టు వ్యయంలో 40 నుంచి 50 శాతం రాయితీ వస్తుందని చెప్తున్నారు. సేంద్రీయ విధానంలో కూరగాయలు పండించే రైతులతో కూడా క్లస్టరు ఏర్పాటు చేయనున్నట్లు హార్టీకల్చర్ విభాగం అధికారులు తెలిపారు. క్లస్టర్ విధానంపై చిత్తూరు జిల్లాలోని అభ్యుదయ రైతులు, రైతు సంఘాలు, ఉద్యాన రైతులకు అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో అధికంగా పండించే పంట ఉత్పత్తులను తొలుత ఎంపిక చేస్తారు.
అనంతరం రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య, పారిశ్రామికవేత్తలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో క్లస్టర్ ప్రాజెక్టును నిర్వహిస్తారు. ఔత్సాహికులతో నేషనల్ హార్టికల్చర్ బోర్డుకు దరఖాస్తు చేయించటంపై అధికారులు ప్రస్తుతం దృష్టి పెట్టారు. క్లస్టర్ విధానం కింద విత్తనం నుంచి పంటల సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, ఎక్స్‌పోర్ట్స్ ఇలా అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.
క్లస్టర్ విధానంలో అనేక లాభాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. రైతులు పండించిన తమ ఉత్పత్తులను మార్కెట్లో ఎంత ధర వస్తే అంతకే అమ్ముకోవాల్సి ఉంటుందని.. అలా కాకుండా క్లస్టర్ నిర్వహణ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేస్తే.. రైతుల పంట ఉత్పత్తులను సదరు సంస్థ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని వివరిస్తున్నా్రు. పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతులను కూడా చేస్తారని చెప్తున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 2 వేల ఎకరాల వరకూ భూమి ఉంటుందని.. 250 మంది వరకూ రైతులు ఉంటారని వివరిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా అందుతాయని వివరిస్తున్నారు.
Latest News